ఒక వ్యక్తి బంగారం కోసం వెతుకుతూ ఒక రాయిని కనుగొన్నాడు. దానిలో కచ్చితంగా బంగారం ఉందని నమ్మి, దాన్ని పగలగొట్టేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నించాడు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాయి చెక్కుచెదరలేదు. చివరకు శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించగా, అది బంగారం కన్నా ఎంతో విలువైన, సుమారు 460 కోట్ల సంవత్సరాల పురాతనమైన ఉల్క అని తేలింది. ఈ ఆసక్తికర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. డేవిడ్ హోల్ అనే వ్యక్తి 2015లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఉన్న మేరీబరో రీజనల్ పార్క్‌లో మెటల్ డిటెక్టర్‌తో బంగారం కోసం గాలిస్తున్నాడు. ఆ ప్రాంతం 19వ శతాబ్దంలో గోల్డ్ రష్‌కు ప్రసిద్ధి కావడంతో, అక్కడ దొరికిన ఎర్రటి, బరువైన రాయిలో పెద్ద బంగారు గడ్డ ఉండొచ్చని భావించాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి రంపం, గ్రైండర్, డ్రిల్ వంటి పరికరాలతో పగలగొట్టాలని చూశాడు. చివరికి యాసిడ్ పోసి, పెద్ద సుత్తితో కొట్టినా అది కొంచెం కూడా పగలలేదు.

కొన్నేళ్ల తర్వాత, ఆ రాయి ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో డేవిడ్ దాన్ని మెల్బోర్న్ మ్యూజియానికి తీసుకెళ్లాడు. అక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు డెర్మోట్ హెన్రీ, బిల్ బిర్చ్ దానిని పరిశీలించి, అది సాధారణ రాయి కాదని, ఒక అరుదైన ఉల్క అని నిర్ధారించారు. తన 37 ఏళ్ల కెరీర్‌లో ప్రజలు తీసుకొచ్చిన వేలాది రాళ్లలో కేవలం రెండు మాత్రమే నిజమైన ఉల్కలని తేలాయని, వాటిలో డేవిడ్ తెచ్చింది ఒకటని హెన్రీ తెలిపారు.

ఈ ఉల్కకు 'మేరీబరో' అని పేరు పెట్టారు. దీని బరువు 17 కిలోలు. పరిశోధకులు డైమండ్ రంపంతో దానిలోని కొంత భాగాన్ని కత్తిరించి చూడగా, అధిక శాతంలో ఇనుము ఉన్నట్లు కనుగొన్నారు. దీన్ని H5 ఆర్డినరీ కాండ్రైట్‌గా వర్గీకరించారు. సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి సిలికేట్ ఖనిజాల సూక్ష్మ స్ఫటికాలు (కాండ్రూల్స్) కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ ఉల్క అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న గ్రహశకలాల మండలం (ఆస్టరాయిడ్ బెల్ట్) నుంచి వచ్చి ఉండవచ్చు. కార్బన్ డేటింగ్ ఆధారంగా ఇది సుమారు 1,000 సంవత్సరాల క్రితం భూమిని చేరినట్లు భావిస్తున్నారు. విక్టోరియా రాష్ట్రంలో ఇప్పటివరకు కనుగొన్న 17వ ఉల్క ఇదే కావడం విశేషం. ఈ పరిశోధన వివరాలను 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ విక్టోరియా' జర్నల్‌లో ప్రచురించారు.