విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత జపాన్‌కు చెందిన ఓ జంట మళ్లీ ఒక్కటైంది. అదీ కూడా భారత గడ్డపై, హిందూ సంప్రదాయ పద్ధతిలో పునర్వివాహం చేసుకుంది. హీరో చిహారా, షిజూ అనే ఈ జపనీస్ దంపతులు తమ ముగ్గురు పిల్లల సమక్షంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నవంబర్ 23న మళ్లీ వివాహ బంధంతో ఏకమయ్యారు.

హీరో చిహారా, షిజూ 2022లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అయితే, వారి భారతీయ స్నేహితుల ప్రోత్సాహం, చొరవతో 2023లో వారి మధ్య మనస్పర్థలు తొలగిపోయి మళ్లీ దగ్గరయ్యారు. తమ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి వీరు తమ స్నేహితుడు పంకజ్ జోషి వివాహానికి హాజరయ్యేందుకు నవంబర్ 21న లక్నో వచ్చారు. అక్కడి వివాహ వేడుకలు, సంప్రదాయాలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో తాము కూడా హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 23న గోమతి నగర్‌లోని రాధా-కృష్ణ ఆలయంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వరుడు హీరో కుర్తా-పైజామా, వధువు షిజూ సల్వార్-కుర్తా ధరించగా.. పూల దండలు మార్చుకోవడం, సిందూరధారణ, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవడం వంటి కార్యక్రమాలతో వేడుక సంప్రదాయబద్ధంగా సాగింది.

ఈ సందర్భంగా హీరో చిహారా మాట్లాడుతూ, "ఈ విధంగా పెళ్లి చేసుకోవడం మాకు ఎంతో విలువైన అనుభూతినిచ్చింది. మాకు భారత్ అంటే చాలా ఇష్టం. విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వేడుకను ఇక్కడే జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం" అని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ జంట పెళ్లి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విడిపోయిన బంధానికి మరో అవకాశం ఇవ్వడమే కాకుండా, భారత సంస్కృతిపై వారు చూపిన అభిమానానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.