ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ హ్యూమనాయిడ్ రోబోల రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 9 వరకు అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరగనున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2027) వేదికగా తమ మొదటి హ్యూమనాయిడ్ రోబో ప్రోటోటైప్‌ను కంపెనీ బహిరంగంగా ఆవిష్కరించే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది.

ఇందులో భాగంగా నవంబర్ 26న సియోల్‌లోని ఆర్ అండ్ డీ క్యాంపస్‌లో శాంసంగ్ బోర్డు డైరెక్టర్ల ఎదుట ఈ సరికొత్త రోబోను దాదాపు 90 నిమిషాల పాటు ప్రదర్శించారు. వేగవంతమైన కదలికల కంటే కూడా... ఫ్యాక్టరీలలో స్మార్ట్‌ఫోన్ విడిభాగాలను అమర్చడం వంటి అత్యంత కచ్చితత్వంతో కూడిన పనులను సమర్థవంతంగా చేయగలగడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందుకోసం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్లలో వాడే అధునాతన హింజ్ టెక్నాలజీని రోబో చేతివేళ్లు, కీళ్ల నిర్మాణంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. చేతుల కదలికల కోసం ఒక్కో చేతికి 20 మోటార్ల చొప్పున మొత్తం 40 మోటార్లను అమర్చినట్లు సమాచారం.

సెమీకండక్టర్లు, స్మార్ట్‌ఫోన్ల వ్యాపారాలకు తోడు భవిష్యత్ వృద్ధి కోసం శాంసంగ్ ప్రత్యేకంగా ‘రోబోటిక్స్ ఎక్స్‌పీరియన్స్’ విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. 2030 నాటికి తమ తయారీ కేంద్రాలను పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 'స్వయంప్రతిపత్త ఫ్యాక్టరీలు'గా మార్చాలనేది సంస్థ దీర్ఘకాలిక ప్రణాళిక. అందులో భాగంగానే ఈ రోబోలను తొలుత తమ సొంత ప్లాంట్లలోనే వినియోగించాలని భావిస్తోంది.