ముంబైలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోర్టు ఫీజులు చెల్లించలేని కారణంగా కేవలం లక్ష రూపాయల పరిహారం మాత్రమే కోరిన ఓ యువతికి 'మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్' (ఎంఏసీటీ) అండగా నిలిచింది. ఊహించని రీతిలో ఆమెకు రూ.89 లక్షలకు పైగా పరిహారాన్ని మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటన బాధితులకు న్యాయం అందించడంలో న్యాయస్థానాల పాత్రను మరోసారి చాటి చెప్పింది.

వివరాల్లోకి వెళితే.. 2018 సెప్టెంబర్ 7న ముంబైలోని వడాలా ప్రాంతంలో శిల్పా యాదవ్ నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ టయోటా ఇన్నోవా కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖం, కటి భాగంలోని ఎముకలు విరిగాయి. చాలాకాలం వెంటిలేటర్, ట్రాకియోస్టమీ సాయంతో చికిత్స పొందినా, ఆమె ఇప్పటికీ సరిగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకున్నారు.

ప్రమాదం తర్వాత పరిహారం కోసం ఆమె ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అయితే, మహారాష్ట్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం, అధిక పరిహారం క్లెయిమ్ చేయాలంటే ఎక్కువ కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు కట్టే స్థోమత లేకపోవడంతో, శిల్పా యాదవ్ తన పిటిషన్‌ను కేవలం రూ.1 లక్షకే పరిమితం చేసుకున్నారు.

ఈ కేసును విచారించిన ఎంఏసీటీ సభ్యుడు శశికాంత్ ఏక్‌నాథ్‌రావ్ బంగర్, బాధితురాలి ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నారు. కోర్టు ఫీజుల కోసం ఉన్న ఆర్థిక ఇబ్బందులు, బాధితురాలికి అందాల్సిన న్యాయమైన పరిహారానికి అడ్డంకి కారాదని ఆయన తన తీర్పులో స్పష్టం చేశారు. బాధితురాలికి శాశ్వత పాక్షిక వైకల్యం 54 శాతమేనని మెడికల్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ, ఆమె సంపాదన సామర్థ్యంపై 90 శాతం ప్రభావం పడిందని ట్రిబ్యునల్ అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో ఆమెకు రూ.58.72 లక్షల పరిహారంతో పాటు 2019 ఆగస్టు నుంచి 7.5 శాతం సాధారణ వడ్డీని కలిపి చెల్లించాలని ఆదేశించింది. దీంతో బాధితురాలికి అందే మొత్తం పరిహారం రూ.89.49 లక్షలకు చేరింది. భవిష్యత్తు ఆదాయ నష్టం, వైద్య ఖర్చులు, సహాయకుల ఖర్చులు, మానసిక వేదన, వివాహ అవకాశాలు కోల్పోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన వాహనానికి 2017 డిసెంబర్‌లోనే ఇన్సూరెన్స్ గడువు ముగియడంతో, పరిహారం మొత్తాన్ని వాహన యజమాని విష్ణుదత్త ఆచార్యనే చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.