బీహార్‌కు చెందిన మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమార్తె వివాహ వేడుకలో ఆయన ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తూ, కారు నడుపుతున్న డ్రైవర్‌ను ఆయన కాలితో తన్నిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో 'ఛోటే సర్కార్'గా పేరొందిన‌ అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం ఈ నెల‌ 25న పాట్నా జిల్లాలోని నద్వాన్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల సందర్భంగా అనంత్ సింగ్ ఒక ఎస్‌యూవీ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి, తనను చూసేందుకు గుమిగూడిన మద్దతుదారులు, అతిథులకు అభివాదం చేశారు. జనం ఆయనకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ఆయన వారికి నవ్వుతూ చేతులు ఊపారు.

అయితే, ఇంతలోనే అనూహ్యంగా ఆయన సహనం కోల్పోయారు. కారు నడుపుతున్న డ్రైవర్‌పై ఆగ్రహంతో ఊగిపోతూ, సన్‌రూఫ్ నుంచే అతడిని కాలితో తన్నారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అనంతరం ఈ వీడియోను 'ఎక్స్‌' (ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి, బహిరంగంగా తన సిబ్బందిపై దాడి చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అనంత్ సింగ్ కుమార్తె వివాహం మొదటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. వేలాది మంది అతిథులతో భారీ విందు, గుర్రపు పందాలు, విలాసవంతమైన కార్ల ప్రదర్శనతో ఈ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, తాజాగా డ్రైవర్‌ను తన్నిన ఈ ఘటన ఆన్‌లైన్‌లో మరో చర్చనీయాంశంగా మారింది.