దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఉదయం గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో నగరం మొత్తం మీద సగటున గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 522గా నమోదైంది. ముఖ్యంగా బల్జీత్ నగర్‌లో ఏక్యూఐ 797గా రికార్డు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. రైల్వే కాలనీలో 745, పంజాబీ బాగ్ హౌసింగ్ సొసైటీలో 719, థాన్ సింగ్ నగర్‌లో 635గా ఏక్యూఐ నమోదైంది. సాధారణంగా ఏక్యూఐ 301 దాటితేనే ప్రమాదకరంగా భావిస్తారు. నగరవ్యాప్తంగా పీఎం2.5 కణాల స్థాయి 336 మైక్రోగ్రాములుగా, పీఎం10 కణాల స్థాయి 471 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

మరోవైపు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం కూడా నగరంలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది. చాందినీ చౌక్ వంటి కొన్ని స్టేషన్లలో ఏక్యూఐ 400 దాటి 'తీవ్రమైన' కేటగిరీలో నమోదైంది. గాలి వేగం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కాలుష్య కారకాలు గాలిలోనే చిక్కుకుపోయి ఈ పరిస్థితికి కారణమయ్యాయి. ఈ కాలుష్యానికి నిరంతరం గురికావడం రోజుకు 12 సిగరెట్లు తాగడంతో సమానమని ఒక అంచనా. దీంతో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా నిలిచింది.