భారత ఈక్విటీ మార్కెట్లపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మళ్లీ బలమైన విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఈ నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో నిధుల ప్రవాహం కనిపించింది. ఈ నెల‌ 26 నాటి గణాంకాల ప్రకారం ఎఫ్‌ఐఐలు ఏకంగా రూ. 1,43,284 కోట్లను భారత మార్కెట్లలోకి పంప్ చేశారు. గడిచిన 10 నెలల్లో మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లిన విదేశీ నిధుల్లో దాదాపు 50 శాతం ఒక్క నవంబర్ నెలలోనే తిరిగి రావడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడ్‌లో బలహీనత, అదే సమయంలో భారత కంపెనీల కార్పొరేట్ ఆదాయాల్లో బలమైన వృద్ధి వంటి అంశాలు ఈ భారీ పెట్టుబడులకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. "ఇది ఆల్-టైమ్ రికార్డ్. గత 10 నెలల్లో భారత్ నుంచి వెళ్లిపోయిన ఎఫ్‌ఐఐ నిధుల్లో దాదాపు 50 శాతం ఈ ఒక్క నెలలోనే తిరిగి వచ్చాయి" అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ తెలిపారు.

ఈ భారీ పెట్టుబడుల ప్రవాహంతో నవంబర్ నెలలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈక్విటీ మార్కెట్‌గా భారత్ నిలిచింది. అంతేకాకుండా, ఈ సానుకూల పరిణామం రూపాయికి కూడా ఊతమిచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.99కి బలపడి, ఆసియాలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. 

విదేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా బ్యాంకింగ్, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, కన్జ్యూమర్ సర్వీసెస్ రంగాలపై దృష్టి సారించారు. ఇప్పటివరకు అమ్మకాల వైపు మొగ్గుచూపిన దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) కూడా గత వారం నుంచి కొనుగోలుదారులుగా మారడం మార్కెట్‌లో సానుకూలతను సూచిస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల జోరు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.