కేరళలోని వయనాడ్‌కు చెందిన ఆరేళ్ల ఐసా బాల్యం తోటి పిల్లల్లా ఆటపాటలతో కాకుండా ఆసుపత్రులు, వైద్య పరీక్షల మధ్యే గడుస్తోంది. ఆమె వయసు చిన్నదే అయినా, శరీరంపై ముడతలు పడి 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తోంది. దీనికి కారణం 'క్యూటిస్ లాక్సా' అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా చర్మం తన బిగుత్వాన్ని కోల్పోయి వదులుగా మారుతుంది. 

ఈ రూపం కారణంగా ఐసా పాఠశాలలో తోటి పిల్లల నుంచి ఎగతాళిని ఎదుర్కొంది. కొందరు ఆమెను 'అమ్మమ్మ' అని పిలవడంతో చిన్నారి మనసు తీవ్రంగా నొచ్చుకుంది. తనను చూసి ఎందుకు అలా అంటున్నారని తల్లిని అడిగి బాధపడేది.

విషయం తెలుసుకున్న ఐసా తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించారు. ఆమె చొరవ తీసుకుని విద్యార్థులందరికీ ఐసా ఆరోగ్య పరిస్థితిని వివరించడంతో పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆరు నెలల వయసులో చిన్నారి శరీరంపై ముడతలు తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా, జన్యు పరీక్షల ద్వారా ఈ అరుదైన వ్యాధి నిర్ధారణ అయింది.

'క్యూటిస్ లాక్సా' ప్రభావం కేవలం చర్మంపైనే కాకుండా గుండె, శ్వాసకోశ వ్యవస్థ, ఇతర అంతర్గత అవయవాలపై కూడా పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేదు. కేవలం లక్షణాలను నియంత్రించడం ద్వారా సమస్యను అదుపులో ఉంచవచ్చని వైద్యులు తెలిపారు. 

చిన్నప్పటి నుంచి తరచూ అనారోగ్యాల బారిన పడుతున్న ఐసాకు ఇప్పటికే రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. భవిష్యత్తులో ఆమె కండరాల నొప్పులు, కదలికల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

'క్యూటిస్ లాక్సా ఇంటర్నేషనల్' సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 400 కుటుంబాలు మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నాయి. భారత్‌లో ఇలాంటి కేసులు ఏడు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అందులో ఐసా ఒకరు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఐసా తండ్రి నెలసరి ఆదాయం కేవలం రూ.12,500. 

ఈ తక్కువ ఆదాయంతో కుటుంబ పోషణ, చిన్నారి వైద్య ఖర్చులు భరించడం వారికి పెనుభారంగా మారింది. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఐసా మాత్రం పెద్దయ్యాక డాక్టర్‌ను అవుతానని, తనలాంటి పిల్లలకు వైద్యం చేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె తెలివితేటలు, చురుకుదనం చూసి తండ్రి గర్వంగా ఫీలవుతున్నారు.