అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ ప్రయాణికుడి చేతిలో తీవ్ర దాడికి గురైన సోమాలి-అమెరికన్ ఉబర్ డ్రైవర్, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిన్నెసోటాలోని మిన్నియాపొలిస్ శివారులో నవంబర్ 14న జరిగిన ఈ ఘటనలో 51 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం హెన్నెపిన్ కౌంటీ మెడికల్ సెంటర్‌లో ఆయన మరణించినట్లు కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (సీఏఐఆర్‌) ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. నవంబర్ 14న మొహమ్మద్ యూసుఫ్ తన కారులో ప్రయాణికుడిని ఎక్కించుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. నిందితుడు యూసుఫ్ మెడకు సీటు బెల్టు బిగించి, ఆయన కారుతోనే ఆయన్ను తొక్కించి పడేసి పరారయ్యాడు. ఈ ఘటనలో యూసుఫ్‌కు ప్రాణాంతక గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన 25 ఏళ్ల సమిత్ అపూర్వ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, తొలుత హత్యాయత్నం, కార్‌జాకింగ్ అభియోగాలు మోపారు. ఇప్పుడు యూసుఫ్ మరణించడంతో, నిందితుడిపై సెకండ్-డిగ్రీ ఉద్దేశపూర్వక హత్య కేసుగా అభియోగాలను మారుస్తున్నట్లు హెన్నెపిన్ కౌంటీ అటార్నీ మేరీ మోరియార్టీ తెలిపారు.

ఘటన జరిగినప్పుడు యూసుఫ్ తన సోదరుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ప్రయాణికుడు పటేల్.. 'మొహమ్మద్' అనే పేరు తనకు నచ్చలేదని చెప్పినట్లు యూసుఫ్ సోదరుడు విన్నారని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత, తనను సీటు బెల్టుతో ఉరివేస్తున్నారని, కారుతో తొక్కిస్తున్నారని యూసుఫ్ సోమాలి భాషలో అరవడం వినిపించిందని ఆయన తెలిపారు. అయితే, ఈ దాడి జాత్యహంకార లేదా విద్వేషపూరిత కోణంలో జరిగిందని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్ తెలిపారు.

ఈ ఘటనతో అమెరికాలోనే అతిపెద్ద సోమాలి జనాభా ఉన్న మిన్నెసోటాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 1993లో అమెరికాకు వలస వచ్చిన యూసుఫ్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. మరణానికి ముందు ఆయనకు ఐదు సర్జరీలు జరిగాయని ఆయన కుమారుడు ముస్తఫా ఉస్మాన్ తెలిపారు.