మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న 'కాకా' సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చిరంజీవి స్వయంగా తెరదించారు. ఈ చిత్రం 2027 సంక్రాంతికి రాదని, దాని స్థానంలో ‘విశ్వంభర’ వస్తుందని వదంతులు వ్యాపించాయి. ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ, జనవరి 13న 'కాకా' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌ను పంచుకుంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘కాకా’లో మీ ముందుకు వస్తున్నాడు. ఈసారి ఆటో జానీలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ మిమ్మల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. దర్శకుడు బాబీ, చిత్ర బృందం అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో చిరంజీవి పూర్తిస్థాయి వింటేజ్ మాస్ అవతారంలో కనిపించారు. ఖాకీ షర్ట్, కార్గో ప్యాంట్ ధరించి, కళ్లద్దాలతో కాలర్ ఎగరేస్తూ నడుస్తున్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నడుముకు తుపాకీ, వెనుక అనుచరులతో ఉన్న ఈ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇదే కాంబినేషన్‌లో వస్తుండటంతో 'కాకా'పై భారీ క్రేజ్ నెలకొంది.

కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.