2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్ర గతిని మార్చిందని, యావత్ తెలంగాణ తరతరాల ఆకాంక్షను నెరవేర్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. 'దీక్షా దివస్' సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.

"కేసీఆర్‌ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ రాష్ట్రం" అని హరీశ్‌రావు కొనియాడారు. నాడు 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అన్న నినాదంతో కేసీఆర్ మొక్కవోని దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. ఆ పోరాట పటిమ ఫలితంగానే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

కేసీఆర్‌ తన ఆత్మబలాన్ని ఆయుధంగా, వాక్‌శక్తిని ఇంధనంగా, నిజాయతీ, నిబద్ధతలను కవచకుండలాలుగా చేసుకొని తెలంగాణ పోరాటాన్ని విజయతీరాలకు చేర్చిన యోధుడని హరీశ్‌రావు అభివర్ణించారు. ప్రజల కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసి, తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చారని చెప్పారు. 

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ పాలకుల మెడలు వంచి, అర్ధ శతాబ్దపు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేసీఆర్ సాకారం చేశారని వివరించారు. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద జరిగే కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని నివాళులర్పించనున్నారు.