కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియపై ‘ఇండియా’ కూటమిలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన డీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నేడు చెన్నై పయనమయ్యారు. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌తో భేటీ అయి, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరనున్నారు.

ఈ పర్యటనకు కొన్ని గంటల ముందు రాహుల్ గాంధీ, ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా స్టాలిన్‌కు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. “తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా సోదరుడు స్టాలిన్ ఎప్పుడూ ఒక పర్వతంలా నిలబడ్డారు. దేశ ప్రయోజనాల కోసం, తమిళనాడు ప్రయోజనాల కోసం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం మనమంతా కలిసి ఈ బిల్లును ఓడించాలి” అని రాహుల్ కోరారు. 

లోక్‌సభలో సీట్లను 850కి పెంచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ బిల్లు బీజేపీ-ఆరెస్సెస్‌కు అనుకూలంగా దేశ ఎన్నికల స్వరూపాన్నే మార్చేందుకు అపరిమిత అధికారాన్ని ఇస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రాహుల్ విజ్ఞప్తికి ముందే డీఎంకే ఈ బిల్లుకు మద్దతు పలకడం గమనార్హం. 

శనివారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో బిల్లుకు మద్దతిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. డీలిమిటేషన్‌కు సంబంధించి తాము లేవనెత్తిన ప్రధాన డిమాండ్లను సవరించిన బిల్లులో లిఖితపూర్వకంగా చేర్చారని, ఇది తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు గొప్ప విజయమని స్టాలిన్ ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరినందునే పార్లమెంటులో బిల్లుకు మద్దతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించడంతో పాటు లోక్‌సభ సీట్లను 50% పెంచి, 2051 వరకు డీలిమిటేషన్‌ను నిలిపివేయాలనే ప్రతిపాదనలతో కూడిన ఈ బిల్లును రాబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

చెన్నైలో స్టాలిన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు ముంబై వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్‌తో సమావేశం కానున్నారు. ఈ బిల్లుపై పవార్ పార్టీ కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.