హైదరాబాద్‌కు చెందిన బాల సాహిత్య వడ్లమాని సంప్రదాయ సంకెళ్లను తెంచుకుని, అమెరికా వెళ్లి కేవలం 30 ఏళ్లకే మల్టీ మిలియనీర్‌గా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు, సంప్రదాయ ఆంక్షలు ఉన్న కుటుంబంలో పుట్టిన ఆమె, తన కాళ్లపై తాను నిలబడేందుకు 18 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఉన్నత చదువులతో అమెరికాలో అడుగుపెట్టి మోర్గాన్ స్టాన్లీ, అమెజాన్, మెటా వంటి దిగ్గజ టెక్ సంస్థల్లో పనిచేస్తూ ఏటా మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9.29 కోట్లకు పైగా) ప్యాకేజీని అందుకునే స్థాయికి చేరారు.

ఉస్మానియా నుంచి ఐవీ లీగ్ క్యాంపస్ దాకా
బాల సాహిత్య ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత స్వతంత్ర జీవనాన్ని ఆకాంక్షిస్తూ ఎఫ్-1 విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్ఠాత్మక డార్ట్‌మౌత్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఎక్స్ఛేంజ్ స్టూడెంట్‌గా డ్యూక్ యూనివర్సిటీలో 4.0 జీపీఏ సాధించారు. మూడో ప్రయత్నంలో హెచ్-1బీ వీసా సాధించి, ఆ తర్వాత అత్యుత్తమ ప్రతిభావంతులకు ఇచ్చే ఓ-1, ఈబీ-1ఏ వీసాలను కూడా దక్కించుకున్నారు.

మారిన కంపెనీలు.. రెట్టింపైన జీతాలు
ఆమె కెరీర్ మోర్గాన్ స్టాన్లీలో టెక్నాలజీ అనలిస్ట్‌గా మొదలైంది. కళాశాల ముగియగానే అక్కడ ఆమె తొలి జీతం దాదాపు రూ.1.02 కోట్లుగా ఉంది. ఆ తర్వాత అమెజాన్‌కు మారడంతో జీతం రెట్టింపైంది. అక్కడ అంతర్జాతీయ చెల్లింపులు, అలెక్సా వాయిస్ ఏఐ ఉత్పత్తులపై పనిచేశారు. అనంతరం మెటా (ఫేస్‌బుక్)లో చేరి ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, ప్రొడక్ట్ సెక్యూరిటీ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడ ఆమె వార్షిక వేతనం రూ.9.29 కోట్లు (మిలియన్ డాలర్లు) దాటింది. 28 ఏళ్లకే మిలియనీర్‌గా, 30 ఏళ్లకే మల్టీ మిలియనీర్‌గా ఆమె గుర్తింపు పొందారు.

సొంత బిజినెస్ బాట
కోట్లలో జీతం వస్తున్నప్పటికీ తన జీవితానికి అసలైన అర్థం, సంతృప్తిని ఇచ్చే లక్ష్యం కోసం ఆమె మెటా ఉద్యోగాన్ని వదిలేశారు. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థాపకులకు ప్రొడక్ట్ స్ట్రాటజీ, ఏఐ ఇంటిగ్రేషన్‌లో సహాయపడేందుకు సొంత సలహా సంస్థను (అడ్వైజరీ బిజినెస్) నడుపుతున్నారు. సీనియర్ ప్రొడక్ట్ లీడర్లు కెరీర్‌లో ఎదిగేందుకు మార్గదర్శనం చేస్తున్నారు.

కెరీర్ మారేందుకు మూడు ప్రశ్నల ఫార్ములా
ఉద్యోగం మారాలనుకునే వారికి ఆమె మూడు ప్రశ్నలతో కూడిన సాధారణ ఫార్ములాను సూచించారు. కొత్త పాత్ర ద్వారా అత్యుత్తమ వ్యక్తులతో పనిచేసే అవకాశం దక్కుతుందా? ప్రస్తుతం లేని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చా? భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నలు వేసుకోవాలని తెలిపారు. వీటిలో కనీసం రెండింటికి అవును అనే సమాధానం వస్తే వెంటనే కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టవచ్చని స్పష్టం చేశారు. జీవితంలో ముందడుగు వేయాలంటే ఎవరిపై కాకుండా తమపై తాము నమ్మకం ఉంచి రిస్క్ తీసుకోవడమే అసలైన విజయ రహస్యమని ఆమె భరోసా ఇస్తున్నారు.