ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడ్డారు.

పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకొచ్చిన కొందరు వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ బారికేడ్లను విరగ్గొట్టారు. అనంతరం పోలింగ్ కేంద్రం లోపలికి చొరబడి, అక్కడున్న బ్యాలెట్ బాక్సుల్లోకి ఇంకు, నీళ్లు పోశారు. ఈ ఆకస్మిక దాడితో ఎన్నికల సిబ్బందితో పాటు ఓటు వేసేందుకు వచ్చిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బ్యాలెట్ బాక్సులు పూర్తిగా పాడవడంతో అధికారులు పోలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని తమ అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల ఉన్నతాధికారులు వేగంగా స్పందించి, ధ్వంసమైన బ్యాలెట్ బాక్సుల స్థానంలో కొత్త బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రానికి తెప్పించారు. దీంతో నిలిచిపోయిన ఓటింగ్ ప్రక్రియ దాదాపు గంటన్నర తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఈ ఘటనకు బాధ్యులెవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.