రాజస్థాన్‌లోని ఓ మారుమూల జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను ఛేదించి, తమ గ్రామాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఒకరు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ఆడిటర్‌గా ఉద్యోగం సాధిస్తే, మరొకరు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికై ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.

దిద్వానా-కుచమన్ జిల్లాలోని నువాన్ అనే చిన్న గ్రామానికి చెందిన ప్రియాంక ప్రజాపత్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ఆడిటర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆమె తండ్రి సురేష్ ప్రజాపత్ విదేశాల్లో పనిచేస్తుండగా, కుటుంబ బాధ్యతలున్నా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. 12వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివి, ఉన్నత విద్య కోసం జైపూర్ వెళ్లింది. 

నిరంతర శ్రమ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన ప్రియాంకకు గ్రామస్తులు, నూతన సర్పంచ్ కుల్దీప్ సింగ్ రాథోర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ప్రియాంక చిన్నప్పటి నుంచే చదువుపై ఎంతో శ్రద్ధ చూపేదని, ఆమె పట్టుదల, ఏకాగ్రతే ఈ స్థాయికి చేర్చాయని ఆమె మామ శీష్పాల్ ప్రసాద్ తెలిపారు.

ప్రియాంక విజయం గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. సరైన ప్రోత్సాహం, కష్టపడే తత్వం ఉంటే అమ్మాయిలు ఎంతటి ఉన్నత స్థానాలనైనా అధిరోహించగలరని ఆమె నిరూపించారు. ఇదే జిల్లాలోని జుసారి గ్రామానికి చెందిన దీపాలి రాథోడ్ కూడా ఇటీవల భారత సైన్యంలోని మెడికల్ కార్ప్స్‌లో లెఫ్టినెంట్‌గా ఎంపికై వార్తల్లో నిలిచారు. విధుల్లో చేరాక మొదటిసారి గ్రామానికి వచ్చిన దీపాలికి కూడా గ్రామస్తులు పూలమాలలతో, సంప్రదాయ గీతాలతో అపూర్వ స్వాగతం పలికారు.

ఒకవైపు ప్రియాంక, మరోవైపు దీపాలి సాధించిన ఈ విజయాలు.. పుట్టిన ఊరు చిన్నదైనా కలలు పెద్దవిగా ఉండాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని చాటిచెబుతున్నాయి. ఈ యువతుల విజయాలు వారి కుటుంబాలకే కాకుండా, యావత్ సమాజానికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.