తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే అత్యంత కీలక మైలురాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘దీక్షా దివస్’ సందర్భంగా కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

2009 నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ అని ప్రతినబూని కేసీఆర్ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పిందని కేటీఆర్ తెలిపారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ చేసిన ఆ పోరాటం నాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని కదిలించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాది వేసిందని చెప్పారు. "ఒక దీక్ష.. ఒక సంకల్పం.. ఒక రాష్ట్రం" అంటూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బలమైన సంకల్పంతో ముందుకు సాగారని కొనియాడారు. 

నవంబర్ 29 దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాటి ప్రకటన వచ్చేది కాదని, అది లేకపోతే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేతకు గురైన నేల విముక్తి కోసం ఓ భూమిపుత్రుడు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

మరోవైపు ‘దీక్షా దివస్’ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 2009లో కేసీఆర్ దీక్షకు బయలుదేరిన క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన ప్రాంతం ఇదే కావడంతో ఈ సభకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.