ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటల మీద ఉన్న వరుడికి గతంలో అప్పు ఇచ్చానని, ఆ డబ్బు తిరిగివ్వాలని ఓ యువతి డిమాండ్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పెళ్లి తంతు కాసేపు నిలిచిపోయింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని లినెపర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ యువతి వివాహం జరుగుతుండగా, ఊరేగింపుగా వచ్చిన వరుడు పెళ్లి మండపంలోకి అడుగుపెట్టాడు. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే, ఘజియాబాద్‌కు చెందిన పూనమ్ అనే యువతి అక్కడికి చేరుకుంది. వరుడు తనకు డబ్బు బాకీ ఉన్నాడని, అది తిరిగివ్వకుండా పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది.  

వరుడు గతంలో ఘజియాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో తనతో కలిసి పనిచేసేవాడని పూనమ్ పోలీసులకు తెలిపింది. ఆ సమయంలో తన వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడని చెప్పింది. ఉద్యోగం మానేసిన తర్వాత డబ్బు తిరిగివ్వమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని, అందుకే నేరుగా పెళ్లి మండపానికే రావాల్సి వచ్చిందని ఆమె వివరించింది.

యువతి ఆందోళనతో పెళ్లి వేడుక నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై హర్షిత్ కుమార్ నేతృత్వంలో అక్కడికి చేరుకున్నారు. వధూవరులతో పాటు యువతితో కూడా మాట్లాడారు. విచారణలో వరుడు అప్పు తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. పోలీసుల సమక్షంలో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. నిర్ణీత సమయంలోగా డబ్బు తిరిగి చెల్లిస్తానని వరుడు హామీ ఇవ్వడంతో పూనమ్ శాంతించి ఘజియాబాద్‌కు తిరుగుపయనమైంది. ఆ తర్వాత ఆగిపోయిన పెళ్లి వేడుకను తిరిగి కొనసాగించారు.