భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మైదానంలోనే కాదు, బయట కూడా తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా జడేజా చేసిన ఓ సరదా పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తి, స్టెతస్కోప్‌తో తన హృదయ స్పందనను తనే చెక్ చేసుకుంటూ కెమెరాలకు చిక్కాడు.

ఈ ఘటన ఇవాళ‌, మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా హేగ్లీ ఓవల్ మైదానంలో చోటుచేసుకుంది. ఈ టెస్టుకు తుది జట్టులో జడేజాకు చోటు దక్కలేదు. దీంతో అతను సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి డగౌట్‌లో కూర్చున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న స్టెతస్కోప్‌ను తీసుకుని, దాన్ని తన మెడలో వేసుకుని, అచ్చం డాక్టర్‌లా తన గుండె చప్పుడును పరీక్షించుకున్నాడు. ఈ సరదా సన్నివేశం ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఒకవైపు మైదానంలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయడంతో టీమిండియా కష్టాల్లో ఉంది. బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో జడేజా చేసిన ఈ చిన్న పని అందరి ముఖాల్లో నవ్వులు పూయించింది. మ్యాచ్ ఒత్తిడి నుంచి అభిమానులకు కాస్త ఉపశమనం కలిగించినట్లయింది.