దేశంలో సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ఓబీసీలకు పార్లమెంట్‌, అసెంబ్లీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణనను పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. కులగణన చేపట్టకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అవి న్యాయస్థానాల్లో నిలవడం లేదని ఆయన పేర్కొన్నారు. రెండో విడత జనగణనలో కులగణన అంశాన్ని చేర్చకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేస్తోందని, కాంగ్రెస్‌, బీజేపీలు ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని విమర్శించారు.

దేశంలో సుమారు 80 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని, వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్లలో భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకపోతే దేశవ్యాప్తంగా యువత, ఓబీసీల నుంచి తీవ్రమైన తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం అవసరమని ఆయన పేర్కొన్నారు.