తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం 2009 నాటి ఆమరణ నిరాహార దీక్ష. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఈ దీక్ష నేపథ్యంతో 'నాట్ ఎ మహాత్మా' పేరుతో ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రాబోతోంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

అహింసా మార్గంలో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం సాధిస్తే, అదే పంథాలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పోలుస్తూ, ఆ చారిత్రక దీక్ష వెనుక అసలు నిజం ఏంటి? అనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించినట్టు మేకర్స్ చెబుతున్నారు. నాలుగు ఎపిసోడ్లుగా రానున్న ఈ డాక్యుమెంటరీలో 2009 నాటి వాస్తవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

'ఓయ్' చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆనంద్ రంగ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, నాటి రాజకీయ పరిణామాలను లోతుగా విశ్లేషిస్తూ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలిచినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'అనగనగా ఫిల్మ్ కంపెనీ' బ్యానర్‌పై పట్టాభి ఆర్ చిలుకూరి నిర్మించిన ఈ సిరీస్‌కు ముత్యాల సుధీర్ రెడ్డి సహ-దర్శకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్, తెలంగాణ చరిత్రలోని ఈ కీలక అధ్యాయంపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

Play video