ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై వైసీపీ అధినేతజగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో పాటు ప్రస్తుతం పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను కూడా అధికార కూటమి రిగ్గింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య సూత్రాలే అమలు కావడం లేదని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. హే రామ్.. ఆంధ్రప్రదేశ్ ను కాపాడు అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 'ఫ్రీ అండ్ ఫెయిర్' ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు పూర్తిగా కనుమరుగయ్యాయని జగన్ ఆరోపించారు. విపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా, దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అధికారులే నేరుగా చించివేశారని ఆయన ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి ఓట్లను అపహరిస్తున్నారని, చివరకు ఎన్నికల్లో గెలిచిన వారిని కూడా ఓడినట్లుగా ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), పోలీసులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఫలితాలను ప్రభావితం చేస్తున్నారని, ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీ చర్యలను అడ్డుకోవడంలో విఫలమైందని జగన్ విమర్శించారు.

గత ఐదేళ్ల తమ పాలనలో రాష్ట్రం ఎంతో సుస్థిరంగా, ప్రశాంతంగా సాగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూ వ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టాయని జగన్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాల ఘటనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో దాడికి దిగారని, పోలీసుల ముందే వాహనాలకు నిప్పంటించి చంపే ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారికి ప్రభుత్వం కొమ్ముకాస్తూ, బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన పలు వీడియోలను వైఎస్ జగన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జగన్ తన పోస్ట్‌లో పిలుపునిచ్చారు.