బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఆస్తిపాస్తులపై ఇంటర్నెట్‌లో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తనకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు నెట్‌వర్త్ ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రచారంలో పేర్కొంటున్న మొత్తంలో కనీసం 10 శాతం కూడా తన వద్ద లేదని ఆయన తేల్చిచెప్పారు.

'ది అన్‌ఫిల్టర్డ్ అవర్' యూట్యూబ్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ భారతీ ప్రధాన్‌తో మాట్లాడిన అనుపమ్ ఖేర్... తన ఆర్థిక పరిస్థితి, జీవనశైలి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఎంతో ధనవంతుడినని బయట ఒక అభిప్రాయం ఉందని, గూగుల్‌లో తన నెట్‌వర్త్ వివరాలు చూసి తానే స్వయంగా ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఆ తప్పుడు వార్తలను చూసి తన మిత్రులు కూడా సరదాగా డబ్బులు అడుగుతుంటారని ఆయన నవ్వుతూ చెప్పారు.

ఇదే సమయంలో తాను గత పదేళ్లుగా అద్దె ఇంట్లోనే జీవిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. "అద్దె ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్న నాటి నుంచే నాకు ఎంతో మానసిక ప్రశాంతత దక్కింది. ఆస్తుల కొనుగోలు, నిర్వహణకు సంబంధించిన ఒత్తిడి ఏదీ నాకు లేదు. గతంలో నాకు ఒక ఇల్లు ఉండేది, దాన్ని నటి ఆలియా భట్‌కు విక్రయించాను. మా అమ్మ కోసం సిమ్లాలో ఒక ఇల్లు కొన్నాను. నేను, నా సోదరుడు ఇద్దరం అద్దె ఇళ్లలోనే సంతోషంగా ఉంటున్నాం" అని ఆయన తెలిపారు.

అద్దె ఇంట్లో ఉంటున్నప్పటికీ తన జీవన ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడలేదని, మంచి రెస్టారెంట్లలో భోజనం చేయడం, లగ్జరీ హోటళ్లలో బస చేయడం తనకు ఇష్టమని చెప్పారు. కాగా, ఆయన తదుపరి చిత్రం ‘యే ప్రేమ్ మోల్ లియా’ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.