శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా ప్రదర్శించారు. పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన అభ్యర్థి పట్ల తీవ్ర అసమ్మతితో ఉన్న ఆయన, తన వర్గానికి చెందిన ఆరుగురు జడ్పీటీసీ సభ్యులతో కలిసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

శుక్రవారం నెల్లూరు జడ్పీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన 35 మంది జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం, జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియను కలెక్టర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలోనే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సీటులో నుంచి లేచి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆయనను అనుసరిస్తూ ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు కూడా సభను బహిష్కరించారు. జడ్పీ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో తమను సంప్రదించకపోవడంపైనే వారు ఈ విధంగా నిరసన తెలిపినట్లు స్పష్టమైంది.

అయితే, మంత్రి సహా ఏడుగురు సభ్యులు ఎన్నికను బహిష్కరించినప్పటికీ, మిగిలిన సభ్యులతో ఎన్నికల ప్రక్రియను అధికారులు యథావిధిగా కొనసాగించారు. జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికను పూర్తిచేశారు.