కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి కాన్వాయ్‌పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలోని అంకాలమ్మ గూడూరు వద్ద ఈ ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా, తమ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులను ఎంపీ అవినాశ్‌ రెడ్డి తన వాహనాల్లో నామినేషన్ కేంద్రాలకు తీసుకెళుతున్నారు. 

ఈ క్రమంలో టీడీపీ నేత బీటెక్ రవి నేతృత్వంలోని వర్గీయులు కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్లు సమాచారం. ఈ దాడిలో కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని ప్రాథమికంగా తెలిసింది.

పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను అధికార కూటమి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటోందని వైసీపీ కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా, అభ్యర్థులకు భద్రత కల్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయితే, కేవలం సర్పంచ్ అభ్యర్థులకే పోలీసులు భద్రత ఇస్తూ వార్డు సభ్యులను పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అవినాశ్‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థులను తరలిస్తుండగా ఈ దాడి జరగడం గమనార్హం.