విజయనగరం జిల్లాలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కక్షపూరిత రాజకీయాలు చేసే వారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని, చుక్కలు చూపిస్తామని గట్టిగా హెచ్చరించారు.

గతంలో మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులపై అనవసర సానుభూతి చూపిస్తూ ‘అయ్యో పాపం’ అని వదిలేసే పరిస్థితులు ఇకపై ఉండబోవని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఆలోచనా విధానాన్ని (మైండ్ సెట్) మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరినీ సమానంగా చూసే రాజకీయాలు ప్రస్తుత వాతావరణంలో ఇకపై పని చేయవేమోనని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితులు, పార్టీ వర్గాలు అనుసరించాల్సిన వైఖరిపై తన మనసులోని అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు బొత్స వెల్లడించారు. కక్షసాధింపు చర్యలను ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.