వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కర్నూలులోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఆయన బయటకు రాకుండా గృహనిర్బంధం విధించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పాములపాడు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు.

పాములపాడు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాములపాడు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... వైసీపీ 6, టీడీపీ 5, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. దీంతో అక్కడ ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో పోలీసుల తీరు, అధికార కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీపీ ఎన్నికల వేళ టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. ‘‘టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం. కూటమి నేతలకు ఎన్నికల్లో గెలవడం చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ హౌస్ అరెస్ట్‌కు సంబంధించి పోలీసుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.