సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గిరిబాబుతో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. "నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యుడైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని జగన్ పేర్కొన్నారు