వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ (నివాసం)లోకి తన సోదరి వైఎస్ షర్మిల ప్రవేశించకుండా నిరోధించాలని కోరుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు బెంగళూరులోని దేవనహళ్లి కోర్టులో ‘సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్’ పేరిట భీమిశెట్టి రమేశ్ బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

గత కొంతకాలంగా యలహంక ప్యాలెస్ కేంద్రంగా వివాదం నడుస్తోంది. తొలుత షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లోనే నిర్వహించాలని భావించారు. అయితే, భద్రతా కారణాలను చూపుతూ జగన్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో షర్మిల వివాహ వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, తన కుమార్తె వివాహానికి జగన్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు, అలాగే అక్కడ బస చేసేందుకు షర్మిల కుటుంబ సమేతంగా ఆదివారం బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే జగన్ వర్గం అప్రమత్తమై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

ఈ ఆస్తిపై జగన్ తన వైఖరిని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. యలహంక నివాసం తన అత్తగారైన సుగుణమ్మకు చెందినదని, దీనిపై షర్మిలకు ఎటువంటి హక్కులు లేవని ఆయన స్పష్టం చేస్తున్నారు. షర్మిల నేరుగా ప్యాలెస్‌కు వస్తే భద్రతా సిబ్బందితో అడ్డుకోవడం ద్వారా అనవసర రాజకీయ దుమారం చెలరేగే అవకాశం ఉందని భావించిన జగన్, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకే చట్టబద్ధంగా కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ కోరినట్లు తెలుస్తోంది.

ఈ పిటిషన్ దాఖలు కావడంతో వైఎస్ కుటుంబ అంతర్గత విభేదాలు మరోసారి తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పిటిషన్‌పై కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.