ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ మంత్రి, వైసీపీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలను కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు కలిసి వినతిపత్రం అందజేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికలనైనా ప్రశాంతంగా, నిష్పాక్షిక వాతావరణంలో జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

డీఐజీతో సమావేశం అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే టీడీపీ శ్రేణులు విపరీతమైన దాడులకు తెగబడ్డాయని, అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు ఉండేదని, కానీ ఈ దాడులు, హింసాత్మక ఘటనలతో రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని ఆయన మండిపడ్డారు.

ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీలే మూలస్తంభాలని, రాజకీయాలు పుట్టిందే గ్రామాల నుంచి అని బుగ్గన అన్నారు. అందువల్ల గ్రామీణ ఎన్నికల్లో ఓటర్లు, అభ్యర్థులపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.