ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించింది. శంకుస్థాపన జరిగిన కేవలం 12 నెలల వ్యవధిలోలోనే ఇంతటి భారీ అత్యాధునిక తయారీ నాకేంద్రాన్ని పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం. ఈ సాయంత్రం ఐదు గంటలకు ఓ భారీ ప్రకటన ఉంటుందన్న మంత్రి నారా లోకేశ్.. చెప్పినట్టుగానే ఈ మేరకు ప్రకటన చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజ జరిగింది. పనులను శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ ప్రపంచ స్థాయి ప్లాంట్‌లో ఇప్పటికే కాంపా కోలా, పండ్ల రసాలు (జ్యూస్‌లు), ప్యాకేజ్డ్ తాగునీటి ఉత్పత్తి మొదలైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానానికి ఈ ప్లాంట్ అత్యుత్తమ నిదర్శనంగా నిలిచింది.

తరతరాల భారతీయులకు సుపరిచితమైన స్వదేశీ బ్రాండ్ కాంపా కోలా, ఇప్పుడు రాయలసీమ గడ్డ నుంచి సరికొత్త రూపుతో పునర్జన్మ పొందింది. ఓర్వకల్లులో తయారయ్యే ఈ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా సరఫరా కానున్నాయి. ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలతో పోటీ పడేందుకు స్వదేశీ బ్రాండ్‌కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు విస్తృత అవకాశాలు దక్కాయి. గతంలో ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు, ఇతర మెట్రో నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు నంద్యాలకు చెందిన మహేష్ హరి, కర్నూలుకు చెందిన ఆర్.కె. స్ఫూర్తి వంటి ఎంతో మంది స్థానిక యువతీయువకులు తమ సొంత ప్రాంతంలోనే, అంతర్జాతీయ ప్రమాణాలున్న ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. రాయలసీమ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తామన్న హామీ నెరవేరింది.

ఈ భారీ ప్లాంట్ ద్వారా స్థానిక ప్రజలకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. దీంతో పాటు రవాణా (లాజిస్టిక్స్), వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర చిన్నతరహా పరిశ్రమల ద్వారా పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలాంటి పారిశ్రామిక విజయాలను విస్తరింపజేయడమే లక్ష్యంగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయి. ఈ మేరకు నారా లోకేశ్ సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు.