స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టిన రాష్ట్ర ఓటర్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగకుండా ఆపేందుకు కోర్టుల్లో 63 పిటిషన్లు వేసి, బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ పేరిట అడ్డంకులు సృష్టించారని, హింసకు పాల్పడుతూ ఎదురు ఫిర్యాదులు చేసిన వైసీపీ డ్రామాలను ప్రజలు ఏమాత్రం నమ్మలేదని సీఎం మండిపడ్డారు.

ముగ్గురు టీడీపీ నేతలు అలిగారు.. అలా అలగడం నాకు నచ్చలేదు!

రాజకీయాల్లో డబ్బిస్తే ఓటేస్తారనే భావన పోయిందని, ఇటీవల ఒక ఓటరు అభ్యర్థి ఇచ్చిన డబ్బును ఏకంగా బ్యాలెట్ బాక్సులోనే వేసి తిరస్కరించడం ప్రజల చైతన్యానికి నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. ఇదే సమయంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని, అలాంటి వారు వెంటనే తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. 

టికెట్ల సర్దుబాటు సమయంలో టీడీపీలోని ముగ్గురు నేతలు అలిగారని, ఇంత శ్రమించి పనిచేస్తుంటే అలా అలగడం తనకు ఏమాత్రం నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, అక్కడ జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి సమీక్ష జరుపుతామన్నారు.

వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని సీఎం గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన ఈ ఘనమైన తీర్పు తమపై మరింత బాధ్యతను పెంచిందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా మరింత అంకితభావంతో ముందుకు సాగుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

కూటమికి తిరుగులేని ప్రజాదరణ - ట్రిపుల్ ఇంజిన్ సర్కార్

ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమికే అనుకూలంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక పోరులో కూటమి అపూర్వ విజయం సాధించిందని గణాంకాలతో వివరించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 96.42 శాతం స్ట్రయిక్ రేట్, మండల పరిషత్‌లలో 93.15 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రయిక్ రేట్‌ను కూటమి దక్కించుకుందని వెల్లడించారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో 39.81 శాతంగా ఉన్న వైసీపీ ఓటు బ్యాంకు, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో 33.56 శాతానికి పడిపోయిందని, ఏకంగా 6.25 శాతం ఓట్లు ఆ పార్టీకి తగ్గాయని తెలిపారు. కూటమికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణ మరింత పెరిగిందని, ఈ ఘనవిజయంతో రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’ ఏర్పాటైందని సీఎం పేర్కొన్నారు.

సామాన్య కార్యకర్తలు, విద్యావంతులకే జెడ్పీ పీఠాలు

రాజకీయాల్లో కుటుంబ పాలన, ధన ప్రభావానికి తావులేకుండా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలను, విద్యావంతులను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టామని సీఎం వివరించారు. జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో సమన్యాయం కల్పించామన్నారు. 

కర్నూలు జెడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా 25 ఏళ్లకే ఎంబీబీఎస్ పూర్తి చేసిన షేక్ షాదికను, గంపలగూడెం జెడ్పీటీసీగా ఎంటెక్ చదివిన ఎస్సీ యువతి కోట పుల్లమ్మను గెలిపించుకున్నామని చెప్పారు. మొత్తం 22 జెడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 12 మహిళలకే ఇచ్చామని, వీరిలో 14 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని తెలిపారు. అలాగే 20 జెడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 11 మహిళలకు కేటాయించగా అందులో 17 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లేనని వివరించారు.

పల్నాడు జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా యాదవ వర్గానికి చెందిన సామాన్య కార్యకర్త పుచ్చకాయల రమాదేవి, తూర్పుగోదావరిలో శెట్టిబలిజ వర్గానికి చెందిన కాడ పద్మ, కడప జెడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా ముస్లిం మహిళ హబీబున్నీసా, ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పార్టీ యూనిట్ ఇన్‌ఛార్జి కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు, నంద్యాల జెడ్పీ ఛైర్మన్‌గా క్లస్టర్ ఇన్‌ఛార్జి షేక్ బురహానుద్దీన్, పశ్చిమ గోదావరి వైస్ ఛైర్మన్‌గా బూత్ కన్వీనర్ నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లాలో బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి శరణ్యలకు అవకాశం ఇచ్చి ‘కార్యకర్తే అధినేత’ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని చంద్రబాబు పేర్కొన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి ప్రజల ఆమోదం

గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని సీఎం తెలిపారు. తీవ్ర ఎల్‌నినో ప్రభావం, వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని తాకిన సమయంలో తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి ఆదుకుందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను రూ.1.30 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి, ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో కరెంటు ఛార్జీలు పైసా కూడా పెంచలేదని స్పష్టం చేశారు. పోలవరం ద్వారా గోదావరి జలాలను విశాఖపట్నం, కృష్ణా డెల్టాకు తరలించే దిశగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.