2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఈ పవిత్ర మహోత్సవానికి దేశవిదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

రూ.3,723 కోట్లతో అభివృద్ధి పనులు
పుష్కరాల నిర్వహణ నిమిత్తం మొత్తం 22 శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటికే రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం దాదాపు రూ.649.70 కోట్ల విలువైన 659 పనులు ప్రారంభం కాగా, రూ.25.53 కోట్ల విలువైన 69 పనులు పూర్తయ్యాయి. పనుల పురోగతి, నిధుల వినియోగాన్ని పారదర్శకంగా పర్యవేక్షించేందుకు అన్ని శాఖలు జిల్లాల వారీగా వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రజా భాగస్వామ్యం – పకడ్బందీ ఏర్పాట్లు
ఈ పుష్కరాలను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువత సహకారాన్ని పెద్దఎత్తున తీసుకోవాలని సూచించారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయం కోసం నిరంతరం సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

440 ఘాట్లు.. విస్తృత మౌలిక వసతులు
గోదావరి పరివాహక ప్రాంతంలోని 440 ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం రూ.464 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వైదిక ఆచారాల నిర్వహణ, భక్తుల బస, వాహనాల పార్కింగ్ కోసం విస్తృత స్థలాలను కేటాయిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు, రద్దీని నియంత్రించేందుకు 268.12 కిలోమీటర్ల మేర పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు.

రవాణా, రైల్వే సేవలు
పుష్కరాల సమయంలో భక్తుల ప్రయాణ సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో 4,000 ప్రత్యేక బస్సులు, పర్యావరణహితంగా ఉండేలా మరో 649 గ్రీన్ బస్సులను నడపనున్నారు. అలాగే రైల్వేశాఖ సహకారంతో 1,560 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారంతో పాటు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు.

సాంకేతికత వినియోగం – వైద్య సేవలు
పుష్కర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే భక్తులకు సులభంగా సమాచారం అందించేందుకు 135 భాషల్లో సేవలందించే ప్రత్యేక ఏఐ చాట్‌బాట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100 పడకలను సిద్ధం చేయనున్నారు. ప్రతి ఘాట్ వద్ద వైద్య బృందాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రాజెక్టులు – పర్యావరణ పరిరక్షణ
సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును కూడా పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి ప్రారంభించేలా పనులు పరుగులు పెట్టించాలని సూచించారు. భక్తులకు జల రవాణా అనుభూతిని అందించేందుకు రాజమహేంద్రవరం–పోలవరం మధ్య 40 కిలోమీటర్ల పరిధిలో ఆరు ఫ్లోటింగ్ పంటూన్లను ఏర్పాటు చేయనున్నారు.

పుష్కరాలను పూర్తి పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్లాస్టిక్ నిషేధం, పకడ్బందీ వ్యర్థాల నిర్వహణ, గోదావరి జలాలు కలుషితం కాకుండా పరిరక్షించడం, సౌర విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టనున్నారు. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా గోదావరి నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భారీ దీపాలంకరణ, గోదావరి ముగ్గుల పోటీలు, సామూహిక యోగా వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.