హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పశ్చిమ ప్రాంతమైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి దక్షిణ భాగమైన శంషాబాద్ వైపు క్రమంగా విస్తరిస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ), ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసర ప్రాంతాలు నూతన రెసిడెన్షియల్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానంగా శంషాబాద్, మామిడిపల్లి పరిసరాలు మెరుగైన రవాణా సౌకర్యాలు, స్థానిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణతో నివాస ప్రాంతాలుగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

విమానాశ్రయం కేవలం రాకపోకలకే పరిమితం కాకుండా ఏవియేషన్, కార్గో, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ వంటి విభాగాల విస్తరణకు కేంద్రంగా మారింది. ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలను పెద్దఎత్తున సృష్టిస్తూ, నివాసాలకు స్థిరమైన డిమాండ్‌ను పెంచుతోంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా పశ్చిమ ఐటీ కేంద్రాలకు వేగంగా చేరుకునే వీలుంది. వీటికితోడు జీఎంఆర్ సెజ్, హార్డ్‌వేర్ పార్క్, జెమ్స్ పార్క్ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పాటు ఆగాఖాన్ అకాడమీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ 2025 ద్వితీయార్థం నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో మొత్తం గృహ విక్రయాల్లో దక్షిణ హైదరాబాద్ వాటా 5 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. పశ్చిమ హైదరాబాద్ ఇంకా 63 శాతం వాటాతో ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, దక్షిణ ప్రాంతంలో నివాస మార్కెట్ క్రమంగా బలపడుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

భవిష్యత్తులో రానున్న మెట్రో విస్తరణ, జీఎంఆర్ హైస్ట్రీట్ మాల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, దక్షిణ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ఈ కారిడార్ అభివృద్ధికి మరింత దోహదపడనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రముఖ సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. వైష్ణవి గ్రూప్ మామిడిపల్లిలో సౌత్‌వుడ్స్ విల్లా ప్రాజెక్ట్‌తో పాటు గరుడ పేరిట 2, 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లను అభివృద్ధి చేస్తోంది. అలాగే ప్రెస్టీజ్-వైష్ణవి భాగస్వామ్యంలో రాజేంద్రనగర్‌లోని ప్రెస్టీజ్ సిటీ, బెల్లాజియో విల్లాస్, ఫోరమ్ మాల్, అలోఫ్ట్ హోటల్ వంటి సమీకృత ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.

అయితే ఇళ్ల కొనుగోలుదారులు, మదుపర్లు కేవలం భవిష్యత్ ఊహాగానాలను మాత్రమే నమ్ముకోకుండా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణ పురోగతి, నిర్వహణ ఖర్చులు, నిత్యావసర సేవలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో క్షేత్రస్థాయిలో నిర్ధారించుకోవాలి. ప్రతిపాదిత మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నివాస ఎంపిక చేసుకోవడం ఉత్తమమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.