ఆస్ట్రేలియా క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ఠ‌పాలు చేసిన 2018 నాటి శాండ్‌పేపర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కుట్ర గురించి తనకు ముందే తెలుసంటూ వస్తున్న ఆరోపణలను ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమన్ మరోసారి తీవ్రంగా ఖండించాడు. ఆ ఘటన తర్వాత తాను మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని, మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి వెళ్లాలనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్లీ వార్తల్లోకెక్కింది. బ్యాన్‌క్రాఫ్ట్ తన కథనంలో, బంతిని ఎలా రఫ్ చేయాలనే చర్చ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిందని, ఆ సమయంలో కోచ్ డారెన్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సేకర్ కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ శాండ్‌పేపర్ వాడాలనే ఆలోచనను ముందుకు తెచ్చాడని కూడా రాశాడు.

ఈ ఆరోపణలపై ఏబీసీ రేడియోతో మాట్లాడిన లీమన్ స్పందించాడు. "2018 నాటి ఘటనపై నా అభిప్రాయం ఇప్పటికీ మారలేదు. అది ఒక చీకటి సమయం, మేము చాలా తప్పులు చేశాం. కానీ, నా వాదన మాత్రం అదే. ఆ కుట్ర గురించి నాకు ముందుగా తెలియదు" అని స్పష్టం చేశాడు.

బ్యాన్‌క్రాఫ్ట్ చెప్పినట్టుగా ఆ చర్చ జరిగినప్పుడు తాను అక్కడ ఉన్నట్లు తనకు గుర్తులేదని లీమన్ తెలిపాడు. "ఆ సంభాషణ జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నట్లు నాకు గుర్తులేదు. అయినా అది జరిగి ఎనిమిదిన్నర సంవత్సరాలు అవుతోంది. నా వెర్షన్ ఇదే, దానికే కట్టుబడి ఉంటాను" అని అన్నాడు.

ఆ ఘటన తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేసిన లీమన్, ఆ వైఫల్యానికి బాధ్యత వహించాడు. "రివర్స్ స్వింగ్ కోసం బంతిని నేలకేసి కొట్టడం, ఒకవైపు రఫ్ చేయడం వందేళ్లుగా జరుగుతోంది. కానీ 2018లో అది హద్దులు దాటింది. కోచ్‌గా దానికి నేనే బాధ్యుడిని. ఆ ఘటన వల్ల నేను ఏమీ నష్టపోలేదని కొందరు అంటున్నారు. కానీ, నేను క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగాన్ని కోల్పోయాను. అందుకు నేను చింతిస్తున్నాను. ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను" అని లీమన్ ఆవేదనగా మాట్లాడాడు.

"ఆ వివాదం తర్వాత నేను మానసికంగా తీవ్రంగా కుంగిపోయాను. ఊహించనంతటి చీకటి రోజులు చూశాను. సాధారణ స్థితికి రావడానికి నాకు మూడు, నాలుగేళ్లు పట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. కానీ, అందరూ నన్ను ఆ వైపుకే నెడుతున్నట్లు అనిపిస్తోంది" అని అన్నాడు. ఈ వివాదంలో భాగమైన ఆటగాళ్లు, సిబ్బంది అందరి పట్ల తనకు సానుభూతి ఉందని లీమన్ పేర్కొన్నాడు.