బాలీవుడ్‌లో రెండు దశాబ్దాల క్రితం నాటి సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ బ్రేకప్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. సల్మాన్ ఖాన్ నుంచి ఐశ్వర్యా రాయ్‌కు రక్షణగా ఉండేందుకే గతంలో తనను బాడీగార్డ్‌గా నియమించారని నటుడు, బాడీబిల్డర్ కేతన్ కరాండే తాజాగా వెల్లడించారు. 'ఆర్ట్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్' యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం, దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఐశ్వర్య 'కుచ్ నా కహో' సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కేతన్ తెలిపిన వివరాల ప్రకారం... ఐశ్వర్యను ఇంటి నుంచి కారులో షూటింగ్ ప్రదేశాలకు సురక్షితంగా తీసుకెళ్లడమే తన ప్రధాన బాధ్యత. అయితే, ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ నిర్వహించిన ఒక ఫ్యాషన్ షో ముగిసిన తర్వాత తాము కారులో బయల్దేరగా, సల్మాన్ ఖాన్ ఉన్నట్టుండి కారు ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆ క్షణంలో తామంతా ఒక్కసారిగా భయపడిపోయామని కేతన్ గుర్తుచేసుకున్నారు. తాను కారు దిగేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వద్దని వారించి కారును చాకచక్యంగా పక్కకు తిప్పి వేగంగా తీసుకెళ్లిపోయారని చెప్పారు.

ఆ సమయంలో సల్మాన్ వద్ద ఆయుధం ఉండవచ్చని తాను భావించినట్లు కేతన్ సంజ్ఞల ద్వారా తెలిపారు. తాను అప్పట్లో బాడీబిల్డింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టానని, శారీరక ఘర్షణల్లో తలదూర్చడం ఇష్టం లేక మరుసటి రోజే ఆ ఉద్యోగాన్ని వదిలేశానని వివరించారు. ప్రేమించుకున్న ఇద్దరి మధ్య వివాదంలో ఇరుక్కోవడం సరికాదని భావించినట్లు పేర్కొన్నారు. అయితే, కేతన్ కరాండే చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు అటు సల్మాన్ ఖాన్ గానీ, ఇటు ఐశ్వర్యా రాయ్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.