పెంపుడు జంతువుల ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రసిద్ధ ఉత్సవం 'పెట్ ఫెడ్' (Pet Fed) మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. నగరంలోని నోవోటెల్ హోటల్ ప్రాంగణంలో నవంబర్ 21, 22 తేదీల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పెట్ ఫెడ్ చరిత్రలోనే హైదరాబాద్ నగరం ఈ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడంతో స్థానిక పెట్ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

ఈసారి పెట్ ఫెడ్ తన 12వ ఎడిషన్‌లోకి అడుగుపెట్టింది. నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈ ఫెస్టివల్ పర్యటించనుంది. హైదరాబాద్‌తో మొదలయ్యే ఈ ప్రయాణం అనంతరం ఢిల్లీ, బెంగళూరు, పూణే మీదుగా ముంబైలో ముగుస్తుంది.

రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకలో పెంపుడు జంతువుల కోసం పలు రకాల ఆకర్షణీయమైన పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 'పెట్స్ గాట్ టాలెంట్', ప్రత్యేక ఫ్యాషన్ షో, క్యాటాపలూజా, ఇంటర్నేషనల్ క్యాట్ షో, సెక్యూరిటీ డాగ్ షో వంటి ఈవెంట్లు సందర్శకులను విశేషంగా అలరించనున్నాయి. వీటితో పాటు దేశీయ జాతి శునకాల యజమానుల (ఇండీ పెట్ పేరెంట్స్) కోసం ప్రత్యేక కార్యక్రమాలు, జంతువుల ఆటపాటల కోసం డెడికేటెడ్ ప్లే, ఎజిలిటీ జోన్లు సిద్ధం చేస్తున్నారు.

పెంపుడు జంతువులను దత్తత తీసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా 'అడాప్షన్ జోన్లు' ఏర్పాటు చేయనున్నారు. అలాగే పెట్స్ పెంపకం, ఆరోగ్యం, ప్రవర్తన తదితర అంశాలపై సందేహాలు నివృత్తి చేసేందుకు నిపుణులతో మాస్టర్‌క్లాస్‌లు నిర్వహిస్తారు. వీటితో పాటు పెట్ ఉత్పత్తులకు సంబంధించిన షాపింగ్ స్టాళ్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ వేడుక గురించి సంస్థ వ్యవస్థాపకుడు అక్షయ్ గుప్తా మాట్లాడుతూ.. పెట్ ఫెడ్ అనేది కేవలం ఒక సాధారణ ఫెస్టివల్‌గా మాత్రమే మిగిలిపోలేదని, ఇది పెంపుడు జంతువుల ప్రేమికులందరినీ ఏకం చేసే ఒక పెద్ద కమ్యూనిటీగా ఎదిగిందని పేర్కొన్నారు. మూగజీవాల పట్ల అవగాహన, వాటి సంరక్షణ బాధ్యతను మరింత పెంచడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.