బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన ముంబైలోని ప్రసిద్ధ బంగ్లా ‘జల్సా’ యాజమాన్య హక్కులపై బచ్చన్ కుటుంబంలో వివాదం మొదలైంది. అమితాబ్ తమ్ముడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా బచ్చన్ ఈ ఆస్తిపై న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 1993లో జల్సా బంగ్లా యాజమాన్య హక్కులను జయా బచ్చన్‌కు బదిలీ చేస్తూ కుదిరిన ‘గిఫ్ట్ డీడ్’ను ఆమె తీవ్రంగా సవాల్ చేశారు. తన ప్రమేయం, అనుమతి లేకుండానే ఈ బదిలీ జరిగిందని ఆరోపిస్తూ ఆ పత్రాల చెల్లుబాటును రమోలా ప్రశ్నించారు.

ముంబైలోని కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జల్సా బంగ్లా యజమానిగా జయా బచ్చన్ పేరు నమోదై ఉంది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ కార్డులో మాత్రం ఇప్పటికీ రమోలా బచ్చన్ పేరే కొనసాగుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో రమోలా పేరును తొలగించి, జయా బచ్చన్ పేరును చేర్చేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వాస్తవానికి జల్సా బంగ్లా తొలుత తన పేరిట నమోదై ఉందని రమోలా పేర్కొంటున్నారు. 1993 నాటి గిఫ్ట్ డీడ్‌ను సాధారణ కాగితంపై రూపొందించారని, ఆ సమయంలో దానికి ఎలాంటి స్టాంప్ డ్యూటీ చెల్లించలేదని, కనీసం సాక్షుల సంతకాలు కూడా లేవని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ ‘అభయ్ యోజన’ పథకం కింద ఆ డీడ్‌ను క్రమబద్ధీకరించిన విధానంపై కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై గత ఏడు నెలలుగా రమోలా బచ్చన్ పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో, ప్రస్తుతం ఈ వ్యవహారం అంధేరిలోని కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎదుట విచారణకు వచ్చింది. సంబంధిత పక్షాల నుంచి వివరణలు కోరగా, విచారణ కొనసాగుతోంది. ఇంకా ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.

ఈ పరిణామాలపై అమితాబ్ బచ్చన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జయా బచ్చన్ సైతం స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. కాగా, నటుడు అభిషేక్ బచ్చన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఇది పూర్తిగా వారి కుటుంబ అంతర్గత విషయమని, దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు. ముంబై జుహులోని ‘జల్సా’ అమితాబ్ బచ్చన్ నివాసంగానే కాకుండా, ప్రతి ఆదివారం ఆయన తన అభిమానులను కలుసుకునే కేంద్రంగా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.