తెలంగాణలో గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వారికి రూ.5 లక్షల జీవిత బీమాతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని జయభేరీ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి ‘తెలంగాణ గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం’ విధివిధానాలను ఆయన ప్రారంభించారు.

గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గిగ్‌ వర్కర్లు కష్టానికి తగిన ఆదాయం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాహుల్ గాంధీని కలిసిన గిగ్‌ వర్కర్లు తమకు చట్టపరమైన రక్షణ, గుర్తింపు లేదని సమస్యలు వివరించారని గుర్తుచేశారు. వారికి న్యాయం చేస్తామని అప్పట్లో రాహుల్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.

వివిధ రంగాలకు చెందిన పలువురి అభిప్రాయాలు, సలహాలు తీసుకున్న తర్వాతే ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే కాంగ్రెస్ పార్టీ విధానమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న రాహుల్, రేవంత్
సభకు ముందు శిల్పకళా వేదిక నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్‌ వర్కర్లు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం జయభేరీ గ్రౌండ్స్‌లో రాహుల్ గాంధీ గిగ్‌ వర్కర్లతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు, డిమాండ్లను నేరుగా అడిగి తెలుసుకున్నారు.