తెలంగాణలోని యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు 'తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని' ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జరగనున్న ఈ కార్యక్రమం, గిగ్ ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో ఒక కీలక ముందడుగుగా నిలవనుంది.

ఈ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ నిన్న‌ రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్స్‌లో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి ముందు, హైటెక్ సిటీలోని శిల్పారామం వద్ద అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమై, అక్కడి నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీలో పాల్గొంటారు.

ఈ ఏడాది ఆరంభంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 'తెలంగాణ ప్లాట్‌ఫామ్-బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్-2026'ను అమలు చేయడంలో ఈ పథకం ప్రారంభం ఒక మైలురాయి. ఈ చట్టం ప్రకారం గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు, వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, సామాజిక భద్రతా చర్యలు, సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం ఈ పథకం అమలుకు అవసరమైన నిబంధనలను నోటిఫై చేయడంతో పాటు వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. యాప్ ఆధారిత డెలివరీ, రవాణా వంటి రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, సంక్షేమ ఫలాలు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ చారిత్రక కార్యక్రమం, భారత్ సమ్మిట్ ముగింపు సెషన్ జరుగుతున్న సమయంలోనే జరగడం గమనార్హం.