విద్యార్థులు, యువతకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముందడుగు వేసింది. తమ ప్రతిష్టాత్మక ‘యువ (YUVA) క్యాంపెయిన్’లో భాగంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (MRCET) ప్రాంగణంలో ‘ఎంఆర్‌సీఈటీ క్యాంపస్’ పేరుతో నూతన శాఖను ఏర్పాటు చేసింది. ఈ కొత్త బ్రాంచ్‌ను మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.

యూనియన్ బ్యాంక్ పంజాగుట్ట ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్, రీజినల్ హెడ్ ఎంవీఎస్ఎన్ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాకా మురళీ మోహన్, నూతన శాఖ మేనేజర్ లీనా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

యువతలో ఆర్థిక అవగాహనను విస్తృతం చేయడం, బ్యాంకింగ్ రంగానికి వారిని మరింత అనుసంధానించడమే ఈ చొరవ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు. “విద్యార్థులకు సులభతరమైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు పొదుపు, ఆర్థిక నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలపై వారిలో అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం” అని బ్యాంక్ ప్రతినిధులు స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అలవాట్లను అలవర్చడం అత్యంత ముఖ్యమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

కళాశాల ప్రాంగణంలోనే ఈ శాఖ అందుబాటులోకి రావడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, ఇతర సిబ్బందికి అన్ని రకాల బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల సేవలు సులభంగా లభించనున్నాయి.