మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కవిత నేతృత్వంలోని ఈ పార్టీ ప్రజల కోసం కాదని, కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగంలా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ వంటి అనేక అనుబంధ సంస్థలు ఉంటాయని, టీఆర్ఎస్ కూడా అలాంటి ఒక అనుబంధ సంస్థేనని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అంటే ‘తెలంగాణ రక్షణ సేన’ కాదని, ‘తెలంగాణ రేవంత్ సైన్యం’ అని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యమే ఇదని, దానికి నాయకురాలు కవిత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి సౌజన్యంతో, పాంచజన్యం ఎజెండాతోనే కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే ప్రజల ముందుకు తెస్తానని ఆయన స్పష్టం చేశారు.