ఒమన్ లోని అల్ అమరత్ వేదికగా జరిగిన ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ ను భారత చేజిక్కించుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలిచిపోతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హైవోల్టేజ్ సమరంలో భారత యువ జట్టు అద్భుత పోరాట పటిమ కనబరిచింది. మ్యాచ్ దాదాపు చేజారిపోయి, ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకుని కేవలం 1 వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతికి భారత్ విజయానికి 3 పరుగులు కావాల్సి ఉండగా, మోహిత్ ఉల్వా ఫోర్ కొట్టడంతో మైదానంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ సంచలన విజయంతో భారత్ అండర్-19 ఆసియా కప్ చాంపియన్‌గా అవతరించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ అద్భుత సెంచరీతో (111 బంతుల్లో 107) కదం తొక్కగా, అబ్దుల్ ఖాదిర్ మెరుపు ఇన్నింగ్స్ (54 బంతుల్లో 80), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (60 బంతుల్లో 63) రాణించారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ 4 వికెట్లతో సత్తా చాటగా, చిగురుపాటి వెంకట 3 వికెట్లు పడగొట్టాడు.

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టుకు ఓపెనర్లు లక్ష్య రాజేష్ రాయ్‌చందాని (101 బంతుల్లో 80), ఆర్యవీర్ సెహ్వాగ్ (61 బంతుల్లో 58) బలమైన పునాది వేశారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 95 పరుగులు జోడించారు. అనంతరం వీకే వినీత్ (24), మనాల్ చౌహాన్ (32 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన భారత్‌ను మనాల్ చౌహాన్, మోహిత్ ఉల్వా ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ 47.2 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 309 పరుగుల వద్ద ఉన్నప్పుడు మనాల్ చౌహాన్ 9వ వికెట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోయిందని అందరూ భావించారు. పాకిస్థాన్ విజయం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన 11వ నంబర్ బ్యాటర్ చిగురుపాటి వెంకటతో కలిసి మోహిత్ ఉల్వా వీరోచిత పోరాటం చేశాడు.

ఓటమి అంచున నిలిచిన వేళ వీరిద్దరూ అసాధారణ సంయమనం, ధైర్యం ప్రదర్శించారు. మోహిత్ ఉల్వా కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో తుపాను ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 49 పరుగులు చేశాడు. అతనికి తోడుగా చిగురుపాటి వెంకట 8 బంతుల్లో 2 ఫోర్లతో విలువైన 11 పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు కేవలం 16 బంతుల్లోనే అజేయంగా 30 పరుగులు జోడించి, 50 ఓవర్లలో 339 పరుగులు చేసి భారత జట్టుకు ఊహించని విజయాన్ని అందించారు. ఓటమి కోరల్లోంచి మ్యాచ్‌ను లాక్కొచ్చి ట్రోఫీని ముద్దాడిన భారత యువ జట్టు ప్రదర్శనపై క్రీడా వర్గాల్లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.