హైదరాబాద్ నివాస గృహాల (రెసిడెన్షియల్) మార్కెట్ 2026 జనవరి నుంచి అక్టోబర్ కాలంలో స్థిరమైన పనితీరును కనబరిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ (Knight Frank India) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ పది నెలల కాలంలో నగరంలో మొత్తం 61,033 నివాస ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.44,305 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల పరిమాణంలో 1 శాతం స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో మాత్రం 3 శాతం పెరుగుదల నమోదు కావడం విశేషం. మార్కెట్‌లో ఖరీదైన, ప్రీమియం ప్రాపర్టీల కొనుగోళ్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

గత గణాంకాలను పరిశీలిస్తే, 2025 జనవరి–అక్టోబర్ కాలంలో హైదరాబాద్‌లో రూ.43,048 కోట్ల విలువైన 61,699 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ కాగా, 2024 ఇదే కాలంలో రూ.40,078 కోట్ల విలువైన 65,280 ప్రాపర్టీలు నమోదయ్యాయి. ఇక 2026 అక్టోబర్ నెల విషయానికి వస్తే, నగరంలో రూ.4,395 కోట్ల విలువైన 5,318 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2025 అక్టోబర్‌తో (6,194 ప్రాపర్టీలు) పోలిస్తే విక్రయాల పరిమాణం 14 శాతం, సెప్టెంబర్ 2026తో పోలిస్తే 5 శాతం తగ్గింది. లావాదేవీల విలువ కూడా వార్షిక ప్రాతిపదికన 3 శాతం, నెలవారీగా 2 శాతం తగ్గింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగిన పితృపక్షాల సమయంలో సాధారణంగా కొనుగోలుదారులు కొత్త ప్రాపర్టీ లావాదేవీలను వాయిదా వేసుకోవడమే అక్టోబర్ మందగమనానికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రైమరీ, సెకండరీ మార్కెట్ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడింది.

నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. "2026 జనవరి-అక్టోబర్ కాలంలో హైదరాబాద్ నివాస గృహాల మార్కెట్ లావాదేవీల పరిమాణం పరంగా స్థిరంగా కొనసాగింది. అదే సమయంలో నమోదైన లావాదేవీల విలువలో వార్షికంగా 3 శాతం వృద్ధి నమోదైంది. మార్కెట్ ధోరణిలో వస్తున్న మార్పును ఇది స్పష్టంగా సూచిస్తోంది. ముఖ్యంగా అధిక విలువ కలిగిన ప్రీమియం గృహాలు మొత్తం లావాదేవీల విలువను గణనీయంగా పెంచుతున్నాయి. అక్టోబర్ నెలలో పితృపక్షాల కారణంగా రిజిస్ట్రేషన్లు కొంత మందగించినప్పటికీ, మార్కెట్ వృద్ధి అనేది రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పాటు ప్రాపర్టీల సేల్స్ వ్యాల్యూ ద్వారా సానుకూలంగా సాగుతోంది" అని వివరించారు.

రూ. కోటి దాటిన ఇళ్లకే క్రేజ్

బడ్జెట్ విభాగాల వారీగా పరిశీలిస్తే, 2026 జనవరి-అక్టోబర్ కాలంలో రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లే రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా (సుమారు 55 శాతం) దక్కించుకున్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి లోపు ఉన్న ఇళ్లు 25 శాతం వాటాను, రూ.1 కోటికి పైబడిన ఇళ్లు 20 శాతం వాటాను నమోదు చేశాయి. అయితే, మొత్తం లావాదేవీల విలువలో మాత్రం రూ.1 కోటికి పైబడిన లగ్జరీ ఇళ్లే ఆధిపత్యం చెలాయించాయి. 2026 పది నెలల కాలంలో నమోదైన మొత్తం విలువలో ఈ ప్రీమియం విభాగం వాటా ఏకంగా 51 శాతంగా (గతేడాది 50 శాతం) ఉంది. ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్లు 12,246 నుంచి 12,322కి పెరగగా, వీటి మొత్తం విలువ రూ.21,475 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.22,680 కోట్లకు చేరింది.

మరోవైపు, ₹50 లక్షల లోపు ఇళ్ల రిజిస్ట్రేషన్లు 34,062 నుంచి 2 శాతం తగ్గి 33,420కి చేరాయి. వీటి లావాదేవీల విలువ మాత్రం రూ.10,710 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.10,751 కోట్లుగా నమోదైంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉన్న విభాగంలో రిజిస్ట్రేషన్లు 15,391 నుంచి 15,289కి (1 శాతం తగ్గుదల), లావాదేవీల విలువ రూ.10,862 కోట్ల నుంచి రూ.10,768 కోట్లకు తగ్గాయి. అక్టోబర్ నెలలో ప్రీమియం విభాగం మరింత బలంగా కనిపించింది. అక్టోబర్‌లో నమోదైన మొత్తం విలువలో రూ.1 కోటి పైబడిన ఇళ్ల వాటా ఏకంగా 59 శాతంగా నమోదైంది.

విశాలమైన ఇళ్లకే ప్రాధాన్యం

కొనుగోలుదారులు పెద్ద విస్తీర్ణం కలిగిన విశాలమైన ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 2026లో నమోదైన ప్రాపర్టీలలో 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 65 శాతం వాటాను ఆక్రమించాయి. 2,000 నుంచి 3,000 చదరపు అడుగుల ఇళ్ల వాటా 13 శాతం నుంచి 14 శాతానికి, 3,000 చదరపు అడుగుల కంటే పెద్ద ఇళ్ల వాటా 3 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే, 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 16 శాతం నుంచి 19 శాతానికి చేరుకుంది. 500 నుంచి 1,000 చదరపు అడుగుల ఇళ్లు 13 శాతం, 500 చదరపు అడుగుల లోపు చిన్న ఇళ్లు 3 శాతం వాటాను పొందాయి.

జిల్లాల వారీగా రంగారెడ్డి జోరు

జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మార్కెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అక్టోబర్ 2026లో నమోదైన మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా వాటా 52 శాతంగా ఉండగా, గతేడాది ఇదే నెలలో ఇది 47 శాతంగా ఉంది. మేడ్చల్-మల్కాజిగిరి వాటా 39 శాతం నుంచి 29 శాతానికి తగ్గింది. హైదరాబాద్ జిల్లా వాటా 14 శాతం నుంచి 18 శాతానికి పెరగగా, సంగారెడ్డి జిల్లా 1 శాతం వాటాను నమోదు చేసింది.

ధరల పరంగా చూస్తే, నగరంలో సగటు చదరపు అడుగు ధర వార్షికంగా 10 శాతం పెరిగి రూ.5,184కి చేరింది. రంగారెడ్డి జిల్లాలో చదరపు అడుగు సగటు ధర 8 శాతం పెరిగి రూ.5,879కి చేరగా, మేడ్చల్-మల్కాజిగిరిలో కూడా 8 శాతం వృద్ధితో రూ.3,807కి చేరింది. సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 25 శాతం వార్షిక పెరుగుదలతో సగటు ధర రూ.3,005గా నమోదైంది.

రికార్డు స్థాయి లగ్జరీ డీల్స్

అక్టోబర్ నెలలో భారీ విలువైన లగ్జరీ ప్రాపర్టీ లావాదేవీలు ప్రముఖంగా నిలిచాయి. ముఖ్యంగా కోకాపేట్, జూబ్లీహిల్స్, పుప్పాలగూడ ప్రాంతాల్లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న యూనిట్లలో భారీ డీల్స్ జరిగాయి. వీటి విలువ ఒక్కొక్కటి రూ.6.93 కోట్ల నుంచి రూ.13.12 కోట్ల వరకు ఉంది. రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో అత్యధికంగా ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ రూ.13.12 కోట్లకు రిజిస్టర్ కాగా, హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్‌లో మరో ప్రాపర్టీ రూ.13.06 కోట్లకు నమోదైంది. అలాగే కోకాపేట్‌లో రూ.10.57 కోట్లు, పుప్పాలగూడలో రూ.8.10 కోట్లు, మళ్లీ కోకాపేట్‌లో రూ.6.93 కోట్ల విలువైన ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. అత్యధిక విలువైన టాప్-5 లావాదేవీలలో నాలుగు రంగారెడ్డి జిల్లాలోనే కావడం గమనార్హం.

ఈ ఏడాది నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే, మే 2026లో అత్యధికంగా 8,344 ప్రాపర్టీలు రూ.5,887 కోట్ల విలువతో రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్‌లో 6,837 ప్రాపర్టీలు నమోదు కాగా, ఆ తర్వాత జూన్‌లో 5,560, జూలైలో 6,166, ఆగస్టులో 5,937, సెప్టెంబర్‌లో 5,620, అక్టోబర్‌లో 5,318 చొప్పున రిజిస్ట్రేషన్లు నమోదవుతూ మార్కెట్ స్థిరత్వాన్ని కొనసాగించింది. తెలంగాణ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ పరిమాణంలో స్థిరంగా ఉన్నప్పటికీ, విలువ పరంగా పటిష్టమైన వృద్ధిని సాధిస్తూ దేశంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
20261112fre060e753ef1a.png20261112fra78f9f43bdea.png