హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రోజురోజుకు తీవ్రమవుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రణాళికతో ముందుకొస్తున్నారు. ఐకియా, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ వంటి అత్యంత రద్దీ జంక్షన్లను కలుపుతూ ‘వన్ వే లూప్’ విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇది అమలైతే వాహనాలు సిగ్నళ్ల వద్ద ఆగకుండా నిరంతరాయంగా ఒకే మార్గంలో ప్రయాణించే వీలు కలుగుతుంది.

ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు రావడంతో ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసులు వన్ వే లూప్ విధానంపై దృష్టి సారించారు. దీని ద్వారా ఐకియా నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు, అక్కడి నుంచి టీ-వర్క్స్, మైహోం భుజా మీదుగా తిరిగి ఐకియా వైపు వాహనాలు ఒకే వలయాకార మార్గంలో ప్రయాణిస్తాయి.

ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ ఈ విధానం విజయవంతం కావడంతో, అదే తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై సైబరాబాద్ సీపీ ఎం. రమేశ్, జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు డీజీపీ సీవీ ఆనంద్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేసిన మూడు రకాల ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు. జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ అధికారులతో చర్చించిన అనంతరం, సాధ్యాసాధ్యాలను బట్టి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.