హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన గిగ్ వర్కర్ల సంక్షేమ పథకంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నోట పలికేవన్నీ గాలి మాటలేనని ఆయన విమర్శించారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటివరకు గాలి మూటలుగానే మిగిలిపోయిన మాట వాస్తవం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్‌ల అమలు ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత హామీలను నెరవేర్చకుండా పక్కనపెట్టేసి, ఇప్పుడు కొత్తగా మరో హామీ ఇవ్వడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు సరిగ్గా కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు కూడా ఆసుపత్రులలో సరిగ్గా పనిచేయడం లేదని ఆయన గుర్తుచేశారు. ఉన్న పథకాలకే దిక్కులేకుండా చేసి, కొత్తగా గిగ్ వర్కర్లకు బీమా, ఆరోగ్య భద్రత కల్పిస్తామంటే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని సంజయ్ స్పష్టం చేశారు.