ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. మావోయిస్టులు అత్యంత రహస్యంగా దాచిపెట్టిన భారీ డంప్‌ను పోలీసులు, భద్రతా సిబ్బంది వెలికితీశారు. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.4.53 కోట్ల విలువైన బంగారం, నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా పరిధిలోని ఇంద్రావతి నది సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఆయుధాలు, నిధులు దాచిపెట్టారన్న సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. బైరాంగఢ్ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బలగాలు సంయుక్తంగా కలిసి గత రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అడవిలోని అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టిన బలగాలకు మావోయిస్టులు భూమిలో దాచిన డంప్ లభించింది.

ఈ డంప్‌ను పరిశీలించగా అందులో భారీగా బంగారం, నగదు బయటపడ్డాయి. మొత్తం 3.84 కిలోల బరువు కలిగిన 33 బంగారు బిస్కెట్లతో పాటు రూ.24 లక్షల నగదును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మార్కెట్ లెక్కల ప్రకారం స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.4.53 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.

ఆపరేషన్ విజయవంతం కావడంతో స్వాధీనం చేసుకున్న బంగారం, నగదును బీజాపూర్ జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రదర్శించారు. మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌కు ఈ స్వాధీనం పెద్ద దెబ్బ అని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి డంప్‌లు ఉన్నాయా అనే కోణంలో కూంబింగ్ కొనసాగుతోంది.