ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి స్నేహితుడికి 19 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో భారీ ఊరట లభించింది. ముంబై సమీపంలోని వివాదాస్పద భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరును అధికారులు పునరుద్ధరించారు. దీంతో రెండు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు ముగింపు పలికినట్లయింది.

ప్రధాని మోదీ స్నేహితుడైన 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా, 1989లో ముంబై సమీపంలోని భయందర్ ఈస్ట్, నవఘర్ ప్రాంతంలో 2,810 చదరపు మీటర్ల స్థలాన్ని రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. 2007లో ఆయన పేరు 7/12 రికార్డుల్లోకి ఎక్కినా, ఆ తర్వాత మరో భూ యజమాని వారసులకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా దాన్ని తొలగించారు. ఈ వివాదంలో స్వయం బిల్డర్స్, బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాతో సంబంధం ఉన్న సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్ ప్రమేయంతో సమస్య మరింత జఠిలమైంది.

ఈ క్రమంలోనే గత సెప్టెంబర్‌లో ముంబై పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని వోరా కలుసుకుని, తన సమస్యను వివరించి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ భేటీ తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్యే మెహతా కంపెనీ ఆ భూమి లావాదేవీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, నిర్మాణ అనుమతులను కూడా వెనక్కి తీసుకుంది.

అయినప్పటికీ వోరాకు భూమిపై హక్కులు దక్కకపోవడంతో రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 19 మధ్య 10 సార్లు విచారణ జరిపిన అదనపు తహసీల్దార్, ఇతర బిల్డర్ల అభ్యంతరాలను తోసిపుచ్చారు. 1989 నాటి వోరా కొనుగోలు ఒప్పందం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని, ఏ కోర్టు దానిని రద్దు చేయలేదని స్పష్టం చేస్తూ నవంబర్ 25న 27 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో వోరా పేరును రికార్డుల్లోకి తిరిగి చేర్చడంతో ఆయన 19 ఏళ్ల పోరాటం ఫలించింది.