ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురిని చంపేందుకు ఓ తండ్రి, సవతి తల్లి కలిసి గంగా కాలువలోకి తోసేశారు. అయితే, గస్తీలో ఉన్న పోలీసుల సమయస్ఫూర్తితో 15 ఏళ్ల ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవంబర్ 27 రాత్రి 10 గంటల సమయంలో భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బృందానికి 'బచావో, బచావో' (కాపాడండి) అంటూ కేకలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చూడగా, ఓ బాలిక కాలువలో కొట్టుకుపోతూ, ఒక చెట్టును పట్టుకుని ప్రాణాల కోసం పోరాడుతోంది. పోలీసులు ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను విచారించగా, తన తండ్రి ఫైసల్, సవతి తల్లి సాయా హసీన్‌ తనను చంపాలనే ఉద్దేశంతో కాలువలోకి తోసేసినట్లు పోలీసులకు తెలిపింది. వారు తనను తరచూ కొట్టేవారని, ఘటన తర్వాత తాను చనిపోయి ఉంటానని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించింది. రుడక్లీ గ్రామానికి చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడైన తండ్రి ఫైసల్ ఒక హిస్టరీ షీటర్ అని పోలీసులు తెలిపారు. ఫైసల్, అతడి భార్య సాయా హసీన్‌లను అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ జరుగుతోంది.