విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ మజ్జి సిరిసహస్ర కుల ధ్రువపత్రం వివాదంలో హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆమె బీసీ-డి సర్టిఫికెట్‌ వినియోగాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. హరినాథ్ శుక్రవారం విచారించారు.

సిరిసహస్ర పొందిన బీసీ-డి (తూర్పు కాపు/గాజుల కాపు) కుల ధ్రువపత్రం ద్వారా ఇతర ప్రయోజనాలు పొందకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత బొమ్మి శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇప్పటికే జిల్లా స్థాయి పరిశీలన కమిటీ, జిల్లా కలెక్టర్ ఈ సర్టిఫికెట్ చట్టబద్ధతను సమీక్షిస్తున్నారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించడం లేదని, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ ప్రక్రియపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే, బీసీ-డి కేటగిరీ కింద ఆమె పొందే ప్రయోజనాలన్నీ కలెక్టర్ జారీ చేసే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అనంతరం, ప్రధాన పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేయగా, జిల్లా పరిశీలన కమిటీ విచారణ డిసెంబర్ 10న జరగనుంది.

వాస్తవానికి, జైన్ కుటుంబంలో ముస్కాన్ జైన్‌గా జన్మించిన సిరిసహస్రను 2020లో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేరు మార్చుకుని బీసీ-డి సర్టిఫికెట్ పొందారు. దత్తత తీసుకోవడం వల్ల కులం మారదని, ఓసీ వర్గానికి చెందిన ఆమెకు బీసీ సర్టిఫికెట్ చెల్లదని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. అయితే ఈ వివాదం ఇప్పటికే జిల్లా కమిటీ పరిశీలనలో ఉన్నందున జోక్యం చేసుకోవద్దని సిరిసహస్ర తరఫు న్యాయవాది కోర్టును కోరారు.