రాజకీయాల్లో వీడ్కోలు అనేది ఉండదని నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. పదవిలో ఉన్న కార్పొరేటర్ అయినా, మాజీ కార్పొరేటర్ అయినా ప్రజాసేవలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ చివరి సర్వ సభ్య సమావేశం వీడ్కోలు సభగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రజలతో కలిసి నడిచేవారికి, ప్రజా సమస్యలపై పనిచేసేవారికి ఎప్పుడూ గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా శ్రేయస్సు కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజలకు దూరం కాకూడదని హితవు పలికారు.

ఎన్నికల సమయంలో రాజకీయ వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులు వేయడం సహజమని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.